Ezekiel 19

1<<కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.

2నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది.

అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.

3వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది.

అది మనుషులను మింగేసింది.

4అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు.

వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు.

5దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.

6ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.

7తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడుచేశాడు.

అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది.

8నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.

9అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరకు తీసుకొచ్చారు.

దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు.

10నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది.

అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది.

11రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.

12కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది.

తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి.

దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.

13కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది.

దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,

దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు.

ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.>>

ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు.

14

Copyright information for TelULB